20, ఆగస్టు 2010, శుక్రవారం

కుమారీ శతకము

1. శ్రీ భూ నీళా హైమవ
తీ భారతు లతుల శుభవ తిగ నెన్ను చు స
త్సౌభాగ్యము నీ కొసగంగ
లో భావించెదరు ధర్మ లోల కుమారీ!

ధర్మపరురాలైన ఓ కుమారీ! శ్రీదేవియు, భూదేవియు,నీళాదేవియు,పార్వతీదేవియు,సరస్వతీదేవియు, నిన్ను మిక్కిలి సుగుణవంతురాలిగా ఎన్నుకొని మంచి ముత్తైదవతనమును, మనస్సులందు తమ తమ ఆశీర్వచనములను నీకు ఇచ్చెదరు గాక.




2. చెప్పెడి బుద్ధులలోపల
దప్పకు మొక టైన సర్వ ధర్మములందున్
మెప్పొంది యిహపరంబులన్
దప్పింతయు లేక మెలగ దగును కుమారీ!
ఓ కుమారీ! నేను చెప్పునట్టి మంచి గుణములనొక్కటినైనను వదలక ఆచరింపుము. ధర్మయుక్తముగా మెప్పు పొంది ఇహపర దోషమిసుమంతైననూ లేకుండా మసలుకొనుము. నీకు శుభములు కలుగును.




3. ఆటల బాటలలోనే
మాటయు రాకుండన్ దండ్రి మందిరమందున్
బాటిల్లు గాపురములో
వాట మెఱిగి బాల! తిరుగ వలయున్ గుమారీ!

ఓ కుమారీ! ఆటపాటలయందు ఏ విధమైన పరుష వాక్యములు పలుకక, మాటపడక, పుట్తింట్లో ఉండేటపుడు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా నడచుకొనుము.




4. మగనికి నత్తకు మామకున్
దగ సేవ యొనర్చుచోటన్ దత్పరిచర్యన్
మిగుల నుతి బొందుచుండుట
మగువలకున్ బాడి తెలిసి మసలు కుమారీ!

ఓ కుమారీ! మెట్టినింట్లో మగనికి అత్తమామలకు సపర్యలు జేయుచు, వారిచే మెప్పు పొందునట్లు స్త్రీలు నడుచుకోవాలి. ఈ విషయము మదినందుంచుకొని మెలగుము.




5. పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నడును జేయరాదు బావల కెదుటన్
కనబడగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!

ఓ కుమారీ! భర్త చెప్పిన మాట జవదాటరాదు. ఆయన వద్దని జెప్పిన పనిని ఎన్నడునూ చేయరాదు. బావలకెదురుగా కనబడరాదు. మనస్సునందు, కోపము ఉంచుకొనరాదు. ఎల్లపుడు అట్లే మెలగుము.




6. పరపురుషు లన్న దమ్ములు
వరుదే దైవంబు, తోడి పడుచులు వదినెల్
మఱదండ్రు నత్తమామలు
ధరన్ దల్లియు దండ్రియును దలంపు కుమారీ!

ఓ కుమారీ! అన్యులను అన్నదమ్ములుగా భావింపుము. పతియే ప్రత్యక్షదైవమని, తోడికోడళ్ళు, మఱదళ్ళు, అత్తమామలు వీరంతా తల్లిదండ్రులని తలంపుము.




7. పదములపై జెయివేయక
మదవతి పతిచెంత నిద్ర మరగినన్ జేతుల్
గదలంగనీక కట్టుచు
గదంగొని శిక్షించు యముండు కాక్ష గుమారీ!

ఓ కుమారీ! పతికి సేవచేయక, ఆయన కాళ్ళు వత్తక, యాతని వద్ద నిద్రించే పత్నుల చేతులను యముడు గట్టింగా కట్తి, గదతో మోటుగా శిక్షిస్తాడు.




8. తెచ్చినన్ దేకుండిన నీ
కిచ్చిన నీకున్న మగని నెగ్గాడకు మీ
యొచ్చెము నీపై దేలును
రచ్చల కామాట లెక్కు రవ్వ కుమారీ!

ఓ కుమారీ! నీమగడు నీకు బెట్తినను, పెట్టకపోయిననూ, తెచ్చిననూ, తేకున్ననూ, అతనిని దూషించుట మిక్కిలి తప్పు. మగని దిట్టుట మగువకు మంచిది కాదు. ఐదవతనము హరించును. అందరిలో అపహాస్యం పాలు కాక దప్పదు. కావున మగని దిట్టక చరించుట మగువల విధి.




9.మఱదండ్రు వదినె లత్తలు
మఱదులు బావల కొమాళ్ళు మఱి పెద్దలు రా
నురవడిన్ బీటలు మంచము
లరుగులు దిగుచుండవలయు నమ్మ కుమారీ!

కుమారీ! ఇంటికి మఱదళ్ళు, వదినెలు, అత్తమామలు, మఱదులు, బావల పిల్లలు, పెద్దలు వచ్చినట్లైన గౌరవముతో దిగ్గున మంచము పైనుండి లేవవలెను సుమీ!




10. నోరెత్తి మాటలాడకు
మాఱాడకు కోపపడిన మర్యాదలలో
గోరంత తప్పి తిరుగక
మీఱకుమీ యత్తపనుల మెలగు కుమారీ!
ఓ కుమారీ! సలక్షణ యువతి నోరెత్తి మాట్లాడరాదు. కోఫము వచ్చిననూ బదులు పలుకరాదు. మర్యాదలను అతిక్రమింపరాదు. అత్తగారు చెప్పు పనులు నిర్వర్తించుట మిక్కిలి శ్రేయస్కరము. కావున నట్లే చరింపుము.




11.పతి పర కాంతలతో సం
గతి జేసిన నాదు పుణ్య గతి యిట్లనుచున్
మతి దలపవలయు లేదా
బతిమాలగవలయు గలహ పడక కుమారీ!



ఓ కుమారీ! నీ పతి పరస్త్రీలతో తిరుగుచున్నపుడు తెలివితేటలతో సౌమ్యముగా నీ దారికి తెచ్చుకొనుట నీ విధి. అంతే గాని కొట్లాడరాదు. "నా పుణ్యఫలమిట్టిది" అని మనసున దలంచి ఓర్పు వహించాలి.




12. తిట్టిన దిట్టక, కొట్టిన
గొట్టక, కోపించెనేని గోపింపక, నీ
పుట్టిన యింటికి, బాదము
పెట్టిన యింటికిని వన్నె పెట్టు కుమారీ!

ఓ కుమారీ! నీ భర్త నిన్ను తిట్టినచో నీవు మరల తిట్టకూడదు. కొట్టినచో ఎదురు తిరిగి కొట్టగూడదు. ఒక వేళ నీపై కోపించిన నీవు తిరిగి కోపపడకుము కుమారీ ! పుట్టింటికి, నీ అత్తవారింటికి కీర్తీ వచ్చునట్లు నడచుకో




13. పతి పాపపు బనిజెప్పిన
బతిమాలి మరల్చవలయు బతి వినకున్నన్
హిత మనుచు నాచరింపుము
మతి లోపల సంశయంబు మాని కుమారీ!

ఓ కుమారీ! నీ మగడు చెపిన చెడు పనులను వలదని నెమ్మదిగా ప్రార్ధించి, వారించి, ఆ పని మానునట్లు చేయుము. నీ పతి వినకున్నచో అంతా మన మంచికేననుకొని సందేహములను వదలి పనిని నిర్వర్తించుము.




14. దబ్బరలాడకు కదిమిన
బొబ్బలు పెట్టకుము మంచి బుద్ధి గలిగి యెం
దెబ్బెఱికము బూనక కడు
గొబ్బున జిత్తమున వాని గూర్పు కుమారీ!

ఓ కుమారీ! అబద్ధములు చెప్పకు. నీ భర్త కొట్టబోయినచో కేకలు పెట్టి అల్లరి పాలు కావలదు. ఏ పనినైనా అసహ్యించుకొనక మంచి బుద్ధితో వెంటనే ఆయా పనులను నెరవేర్పుము.




15. పతి భుజియించిన పాత్రను
మెతు కొక్కటియైన భార్య మెసంగుటికై తా
హిత మూనకున్న నది యొక
సతియే ? కడు బాప జాతి జగతి కుమారీ!

ఓ కుమారీ! భర్త భుజించిన పాత్రలో అతడు వదలిన ఒక్క మెతుకైననూ భార్య దినుట పతివ్రతా లక్షణమనబడును దీనినే భర్త చేసుకొన్న పుణ్యములలో భాగమును గ్రహించుటయని అర్ధము. భార్య దినిన పాత్రలో భర్త దినుటయనే ప్రశ్న లేదు గావున భార్య చేసుకొన్న పుణ్యములలో భాగమునకు భర్త రాడు. భార్య చేసికొన్న పుణ్యములు ఆమేకే చెందునని భావము. పతివ్రతా స్త్రీలు ఈ విధంగా నడచుకొనవలెను. అట్లు చేయని ఆడది ప్రపంచములో చెడ్డజాతి స్త్రీలతో చేరును. అనగా పాపిష్టురాలగును.




16. జపములు, గంగా యాత్రలు
దపములు, నోములును, దాన ఢర్మంబులు, పు
ణ్య పురాణము పతిభక్తికి
నుపమింపను సాటి రాక యుందు కుమారీ!

ఓ కుమారీ! పత్నికి పతియే ప్రత్యక్ష దైవము కావున జపతపాలు, గంగా తీర్థ యాత్రలు, నోములు, దానధర్మాలు, పుణ్యపురాణ కథా శ్రవణములు, మొదలగు పుణ్యకార్యములన్నియు నీ పతి తర్వాతనేయని తెలుసుకొనుము. కారణం నీ మగని పుణ్యములలో కొంత భాగమును నీవు అర్హురాలవయినావు కావున జ్ఞాన మెరిగి మసలుకొనుము. పతిభక్తి గొప్పదని తెలిసికొనుము.




17. ఇరుగు పొరుగిండ్లు కైనను
వరుండో, కాకత్తగారో, వదినెయో, మామో
మఱదియో సెలవిడకుండంగ
దరుణి స్వతంత్రించి పోవన్ దగదు కుమారీ!

ఓ కుమారీ! యవ్వనవతీ! నీ భర్త, వదినె, మామ, మరుదులు, వెళ్ళమని జెప్పింతే దప్ప పొరబాటున నైననూ పొరుగిండ్లకు పోవద్దు. ఎవరి ఆజ్ఞలేకుండా నీకు నీవై పొరుగిండ్లకు పోవుట పాతివ్రత్య లక్షణము కాదు.




18. కూతురు చెడుగై యుండిన
మాతది తప్పన్నమాట మది నెఱుగుదుగా
నీ తల్లిదండ్రులకు నప
ఖ్యాతులు రానీయ గూడ దమ్మ కుమారీ!
ఓ కుమారీ! కూతురు తప్పు చేయుట తల్లి దప్పుయని నీకు తెలుసు కదా! కవున నీ కన్న తల్లిదండ్రులకు అపఖ్యాతి తీసుకురావద్దు.




19. అమ్మకు రెండబ్బకు రెం
డిమ్మహిం డిట్టంచు కూతురెందుకు ధర నా
ద్రిమ్మరి పుట్టకపోయిన
నిమ్మళమని యండ్రు జనులు నిజము కుమారీ!

ఓ కుమారీ! తల్లిదండ్రులను రెండేసిమారులు తిట్టించు కూతురెందులకు? అపఖ్యాతి తెచ్చు మాతాపితరులను అపహాస్యం పాలు జేసే కూతురు పుట్టకబోయిననూ సంతోషమేయని ప్రజలనుట సత్యము.




20. తన బావల పిల్లల యెడన్
దన మఱదుల పిల్లలందు దనపిల్లల కం
టెను మక్కువ యుండవలెన్
వనితల కటువైన వన్నె వచ్చున్ కుమారీ!
ఓ కుమారీ! తన బావల, మరుదుల పిల్లలను తమ కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూచుకున్న ఆడదానికి కీర్తి వచ్చుననుటలో సందేహము లేదు.




21. ధనహీనుడైన గడు దు
ర్జనుండైనన్ గురూపియైన జారుండైనన్
విను పాపియైన నెప్పుడు
దన పతియే తనకు దైవతంబు కుమారీ !
ఓ కుమారీ! భర్త భాగ్యవంతుడు కానివాడైనూ (పేదవాడైననూ) మిక్కిలి చెడ్డవాడైననూ (దుర్మార్గుడైననూ (కురూపి) వ్యభిచారుడైననూ, పాపిష్టుడైననూ, తన మగడే తనకు దేవుడను తెలుసుకొమ్ము.




22. ధనవంతుడైన యప్పుడు
పెనిమిటి చిత్తం బెఱింగి పెండ్లాము మెలం
గును లేమి మెలంగ నేర్చిన
వనితకు లోకమున వన్నె వచ్చు కుమారీ !
ఓ కుమారీ ! భర్త భాగ్యవంతుడైనపుడు యాతని మనస్సు నెరింగి నడుచుకోవలెను. ఒక వేళ భాగ్యహీనుడైనచో (డబ్బులేనివాడు ) ఆతని చిత్తము నెరింగి నడుచుకొన్న స్త్రీ ఇహపరలోకములలో కీర్తి గడించును.




23. కడుపారన్ గూడు గూరలు
దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుం దా
వడితనమునన్ బెనిమిటితో
నెడన్ బాసి చరింపన్ గూడ దెపుడు కుమారీ !

ఓ కుమారీ! మగని వద్ద దన కోరికలు దీరవని, ఆతని వద్ద పంచభక్ష్య పరమాన్నములతో కడుపు నిండదని,కావలసిన రంగురంగుల వస్త్రములు లభింపవని గూడు దొరకదని అనుకొని తొందరపడి యాతనిని వదలివేసి జీవించుట మగువకు మర్యాద కాదు. సమాజములో చిన్న చూపుతో చూడబడతారు.




24. తలిడండ్రులన్న దమ్ములు
తుల దూగంగ నిమ్ము పసిడి తోనైనను వా
రల యింట సతత ముండుట
వెలదికి మర్యాద గాదు వినవె కుమారీ !
ఓ కుమారీ! తల్లిదండ్రులు, అన్నదమ్ములుగాని ఎంతటి భాగ్యవంతులైననూ వారి ఇంటా ఎల్లప్పుడు ఉండుటా ఆడువారికి మర్యాద గాదు.

25. పిల్లల గనుగొనన్ దలచిన
యిల్లాలు గతాగతంబు లెఱుంగక ఱాగైన్
యల్లరిన్ బెట్టినన్ జెడున్ దా
నుల్లసముల బడును, గీడు నొందున్ గుమారీ !

ఓ కుమారీ ! బిడ్డలను కనవలెననే యాడుది, మంచి చెడ్డల దెలుసుకొనక, మర్యాద దప్పి అల్లరి బెట్టినచో దానే జెడిపోవును అవమానముల పాలై కష్టాములు పొందును.




26. పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానగవలయున్
హిత మాచరింపవలయును
బ్రతుకున కొక వంక లేక పరంగు గుమారీ !
ఓ కుమారీ ! భర్తకు,అత్తమామలకు ఇష్టాములేని పనిని చేయకుము. వారికిష్టమైన మంచి పనులు చేసి మెప్పుబడయవలెను. నీజీవితంలో మచ్చలేకుండా మసలుకొనుము.




27. పోకిళ్ళు పోక పొందిక
నాకులలో బిందెరీతి నడఁకువగా నెం
తో కలసిమెలసి యుండిన
లోకములోపలను దా వెలుంగుఁ గుమారీ !
ఓ కుమారీ ! వ్యర్ధ ప్రసంగములకు పోవద్దు.అతిగా వాగకూడదు. ఆకుల మధ్యనుండే పిందెవలె ఒదిగియుండి వినయముతో కలసి మెలసి నడుచుకొనవలెను. అప్పుడే ఆ స్త్రీకి సమాజములో పేరు ప్రఖ్యాతులు, గౌరవమర్యాదలు లభిస్తాయి.




28. అత్తపయిన్ మఱదలిపయి
నెత్తిన కోపమున బిడ్డ నేడ్పించుటకై
మొత్తినఁ దనకే కీడగుఁ
జిత్తములో దీనిఁజింత సేయు కుమారీ !
ఓ కుమారీ ! అత్త, మరదళ్ళపై వచ్చిన కోపమును బిడ్డలపై జూపించినచో నష్టపోయేది తానేయని మరువకుము. మనస్సునందొక్కసారి దీనిని గురించి ఆలోచింపుము.




29. మృతియైనను బ్రతుకైనం
బతితోడనె సతికి జెల్లుఁ బతిబాసిన యా
బ్రతుకొక బ్రతుకా? జీవ
స్మృతిగాక వధూటి కెన్న నిదియుఁ గుమారీ!
ఓ కుమారీ! పతివ్రతయైన పడతికి తన పతితోడనే జీవితము తెలుసుకొమ్ము. చావైననూ, బతుకైననూ తన భర్తతోనే భర్త విడిచిన ఆడుదాని బ్రతుకొక బ్రతుకేనా! ఆ బ్రతుకు బ్రతికిననూ చచ్చినదానితో సమానమే.




30. మగని ప్రియ మబ్బె ననుచును
దెగ నీలిగి యింటివారి దిగంద్రొక్కుచు దుం
డగురాలై తిరిగిన సరి
మగువలలో నిదియె తప్పు మాట కుమారీ!
ఓ కుమారీ ! తన భర్త తన మాట జవదాటడని తలంచి గర్వముతో, తన యింటివారిని నీచముగా చూచుట మగువకు తగదు. అటువంటి స్త్రీ తోటి స్త్రీలయందు అవమానములపాలగును.




31. జీవములు భర్తపద రా
జీవములని చిత్తమందుఁ జింతించిన ల
క్ష్మీవల్లభు చరణంబుల
సేవ లతాంగులకు నెమ్మిఁ జేయు గుమారీ!
ఓ కుమారీ! భర్త పాదముల వద్దే తన జీవితమని తలంచిన పతివ్రతలకు తన పాద సేవా భాగ్యములను ఆ విష్ణుమూర్తి ప్రెమతో కలుగజేయును.




32. కడు బుద్ధి గలిగి మెలంగినఁ
బడంతుక పుట్టింటివారు పదివేల వరా
లిడుకంటే గీర్తి యగు ద
మ్మిడి లేకుండినను నేర్చి మెలగు కుమారీ !
ఓ కుమారీ ! మిక్కిలి చాతుర్యముతో మెలగిన ఆడాదానికి పుట్టింటి వారు పదివేల వరాలనిచ్చుటకంటెను మిక్కిలి గొప్పది. కీర్తిగలదగును. ఆడువారు భోగభాగ్యములున్నను, లేకున్నను ఈ సూక్ష్మమునెరింగి నడచుకొనవలెను.

33. కడుఁబెద్దమూటా దెచ్చినఁ
జెడుగై వర్తించు నేనిఁ జిరతర చింతం
బడుదురు తల్లిదండ్రులు తోఁ
బడుచులు సోదరులు నిందఁ బడుచు గుమారీ!
ఓ కుమారీ! అత్తవారింటికి నీవెంత పెద్ద మూటతో వచ్చిననూ దుష్టురాలై ప్రవర్తించినచో నీ తల్లిదండ్రుల, అన్నదమ్ముల నిందా శాపములతో నిరంతరము నశించిపోవుదువు.




34. పుట్టింటి వారి నీచతఁ
బెట్టకు మత్తింటివారు పెట్టెడి బాధల్
పుట్టింట దెలియనీయకు
రట్టడి చెలియందు రదియె రవ్వ కుమారీ!
ఓ కుమారీ! పుట్టింటి వారిని నీచముగా జూడకు. అత్తింటి కష్టమును పుట్టింట వెల్లడించరాదు. ఈ విధమైన అల్లరి చేయుట వల్ల అలుసైపోవుదువు.




35. తనకెంత మేలు చేసిన
మనమున కింపైన పనులుఁ మసలిన దాసీ
వనితల కెన్నటికైనం
జనవిచ్చి మెలంగరాదు జగతి గుమారీ!
ఓ కుమారీ! నీ యింటి పనివారు నీకెంత మేలు చేసిననూ, నీ మెప్పు పొందాలని నీకెంత ఇష్టమైన పనులు చేసి పెట్టిననూ వారితో ఒకింత జాగరూకరరో మెలుగుము. వారితో అత్యంత స్నేహముజేసి అమితముగా మోసపోవద్దు.

36. కులదేవతలకు బెట్టిన
పొలుపునం దన యింటియాఁడు బొట్టెల కెల్లం
గలమాత్ర మొసంగకుండిన
గలఁత పొడము దాన మేలు గాదు కుమారీ!
ఓ కుమారీ! ప్రేమతో నీ ఇష్టదేవతలకు బెట్టినట్లు దన ఇంటి ఆడపడుచులకు ఉన్నంతలో బెట్టక పోయినచో, కలహము వచ్చి, వారి శాపానుగ్రహములకు పాత్రురాలవుతావు. వారిని నీ కులదేవతలవలె నెరుంగుము.

37. బద్దకము సంజనిద్దుర
వద్దు సుమీ దద్దిరంబు వచ్చును దానన్
గద్దింతురింటివారలు
మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ!
ఓ యవ్వనవతీ! బద్ధకముతో సాయంకాలము నిద్రించినచో మొద్దువని నిందింతురు. ఇంటివారు తూలనాడేదరు

38. ఇంటఁ గల గుట్టు నీ పొరు
గింట రవంతైనం దెలుప నేఁగకు దానం
గంటనపడి నీవారలు
గెంటించెద రిల్లు వెడలఁ గినుక గుమారీ!
ఓ కుమారీ! నీ ఇంటి రహస్యములను పొరుగింటికి తెల్పినచో పలు అనర్ధములు వచ్చును. సొంతవారే ఏవగించుకొంటారు. విరోధములు వస్తాయి. కోపముతో నీవారే నిన్ను ఇంటినుండి వెడలగొట్టెదరు. కావున గుట్టును రట్టు చేయకుము.

39. వేకువజామున మేల్కని
పైకి వెడలి వచ్చి ప్రాచి పని దీర్పవలెన్
లేకున్నం దెల్లవాఱిన
లోకులు నవ్వుదురు సభల లోనం గుమారీ!
ఓ కుమరీ! తెల్లవాఱుజాముననే ఇంటి ముంగిట పాచి పనులు చేయుట మంచిది. బారెడు పొద్దెక్కిన తర్వాత నలుగురి ఎదుట పాచిపని చేసినచో నవ్వులపాలవుతావు.

40. ఇక్కడి దక్కడం నక్కడి
దిక్కడ జెప్పినను వారి కిద్దఱికిఁ బగల్
పొక్కినఁ గల చేడియ ల
మ్మక్కా! యిడుముళ్ళమారి యండ్రు కుమార
ఓ కుమారీ! అక్కడ మాటలిక్కడ, ఇక్కడ మాటలక్కడ చెప్పి నలుగురిలో నవ్వులపాలుగాకు. కలహాలరిమారియని నిన్నాడిపోసుకుంటారు.

41. తలవాకిట నెల్లప్పుడు
నిలువఁగ రా దెప్పు డెంత నిద్దురయైనన్
మెలఁకువ విడరాదు సుమీ
తల నడచుచు విప్పికొనుట తగదు కుమారీ!
ఓ కుమారీ! ఇంటి ముంగింట్లో అలంకరిచుకుని నిలబడరాదు. మొద్దు నిద్ర పనికి రాదు. నిద్రలో కూడా కొంచెం మగతగా మెలకువ కలిగి యుండవలెను. నడుస్తున్నప్పుడు(జుట్టుముడి) తల వెంట్రుకలు విప్పరాదు. (నిత్యము తల విప్పుకొని ఉండరాదని భావము)




42. వారికి వీరికి గలిగెను
గోరిన వస్తువులు మాకుఁ గొదవాయె నటం
చూరక గుటకలు మ్రింగుట
నేరముగాఁ దలఁవలయు నెలఁత కుమారీ!
ఓ సుకుమారీ! వారికి వీరికి ఉందని, తనకు లేదని చింత పడరాదు. ఇరుగుపొరుగువారి యొక్క భాగ్యమును జూసి ఈర్ష్యపడరాదు. సంతృప్తినలవర్చుకొనవలెను. తనకున్న దానితో తృప్తి పడుట మిక్కిలి యుత్తమము. కోరికలతో చింతపడుట మిక్కిలి తప్పు.

43.కొన్నాళ్ళు సుఖము కష్టము
కొన్నాళ్ళు భుజింపకున్న గొఱగాదు సుమీ
పున్నమ దినముల వెన్నెల
యెన్నంగ సమాసలందు నిరులు కుమారీ!
ఓ కుమారీ! కష్టసుఖాలను, రెండింటినీ అనుభవిస్తేనే జీవితం విలువ తెలియును.పున్నమినాడు వెన్నెలయు, అమావాస్యనాడు చీకటి ఉండుట సహజము కదా!

44. పొంతఁ బని సేయ కెన్నఁడు
పంతంబులు పలుకఁబోకు ప్రాజ్ముఖముగ నీ
దంతంబులు దోమకు మే
కాంతంబులు బయలుపఱుప కమ్మ! కుమారీ!

ఓ కుమారీ! ఎవ్వరితోను కలిసి మెలసి పని చేయక,ఊరికెనే పరుషమైన మాటలు మాట్లాడరాదు. తూర్పు దిశగా పండ్లు తోముకోవద్దు. రహస్యాలు వెల్లడించవద్దు.

45. నడకలలో నడుగుల చ
ప్పుడు వినబడకుండవలయును భువి గుంటలు క
కంపడరాదు మడమ నొక్కులఁ
బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ!
ఓ కుమారీ! నీ అడుగుల చప్పుడు వినబడకుండునట్లు నడువవలెను. నీ కాలి మడమలు గుర్తులు పడకుండ నడవవలెను. స్త్రీల సద్గుణములు తెలుసుకొని జీవింపుమమ్మా!

46. నవంగ రాదు పలుమఱు
నవ్వినఁ జిఱునవ్వుగాని నగరా దెపుడున్
గవ్వలవలె దంతంబులు
జవ్వునఁ గానంగఁ బడెడి జాడ గుమారీ!
ఓ చినదానా! ఇంటి ఇల్లాలు అనవసరంగా ఇకిలించరాదు(నవ్వరాదు). చిరునవ్వు చింతలను బారద్రోలును. పండ్లు కనబడునట్లు పకపకా నవ్వరాదు. నవ్వు నాలుగు విధాలా చేటుయని మరువకుము.

47. తొడవులు మిక్కిలి గలిగినఁ
గడుఁ ప్రేమన్ మగఁడు మిగుల గారా మిడినన్
పడఁతుక పసుపుం గుంకుమ
గడియైనన్ విడువ రాదు గాదె కుమారీ!
ఓ కుమారీ! ఎంత భాగ్యవంతురాలివైనను, మగడెంత బ్రీతితో నిన్ను జూచుకున్నచో ఆడది పసుపు కుంకుమలను నిమిషమైనను వీడరాదు సుమా!

48. చెదుఁగులతో లంజెలతో
గుడిసేటులతోడు బొత్తు కూడదు మది నె
ప్పుడు మ్నిల నుత్తమ కాంతల
యడుగులకు న్మడుగులొత్తు మమ్మ కుమారీ!
ఓ సౌభాగ్యవతీ! చెడ్డవాతి(పోకిరి స్త్రీలు) స్నేహమును చేయరాదు.సౌశీలురు, మంచివారునైన స్త్రీలకు సేవ చేయుట వలన నీకు మంచి జరుగును.

49. విసువకు పని తగిలిన యెడఁ
గసరకు సేవకుల మిగులఁ గాంతునితోడన్
రొసరొస పూనకు మాడకు
మసత్యవచనంబు లెన్నఁడైన గుమారీ!
ఓ చినదానా! మిక్కిలిగా పని ఒత్తిడి కలదని విసుగు చెందరాదు. పనివాండ్రను నెక్కువగా కసరుకొనరాదు. భర్తను ఈసడించరాదు. అసత్యం చెప్పరాదు.

50. వేళాకోళంబులు గ
య్యాళితనంబులును జగడ మాడుతలును గం
గాళీపోకలుఁ గొందెము
లాలోచించుటయుఁ గూడదమ్మ కుమారీ!
ఓ కుమారీ! అనవసరపు వేళాకోళములు, గయ్యాళితనములు,కొట్లాటలు, చిన్న పెద్ద తారతమ్యము అరయక మాట్లాడుటలు, ఫిర్యాదులు చేయుటయు తప్పుయని తెలుసుకొనుమమ్మా!

3 కామెంట్‌లు:

  1. ఈ కుమారీ శతకంలో స్త్రీలకు బోధించిన నీతులు కొన్ని మరీ ఘోరంగా ఉన్నాయి. ఈ శతకాన్ని ఏ కాలంలో ఏ కవి (కవయిత్రి) రాశారు? మరో యాబై పద్యాల సంగతేమిటి?

    రిప్లయితొలగించండి
  2. ఈ శతకాన్ని వేంకట నారసింహ కవి అనే మహానుభావుడు రాశారు. దాదాపు 18 వ శతాబ్దంలో ఈ శతకాన్ని వ్రాశారని సాహిత్య పరిశొధకుల అంచనా.మిగిలిన 50 పద్యాలను కూడా త్వరలొ అంధుబాటులొకి తేవడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  3. ఈ శతకం ద్వారా ఆ కాలంలొ సమాజంలొ స్త్రీ కి ఉన్న స్తానమెంతొ తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి