22, జనవరి 2011, శనివారం

నాకు నచ్చిన అన్నమయ్య కిరీటి

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరుగునో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల....


వివరణ
=====
ఆన్నమాచార్యులవారు భగవంతుదు చేసే ఈ జగత్ సృష్ఠి రక్షణ ప్రళయములను ఒక ఉయ్యాల ఆటతో పోల్చుచున్నారు।చంచలస్వభావము కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలలో నుండుట అలవాటైనది।జీవులు పీల్చే ఉఛ్ఛ్వాసములో నీభావము తెలుస్తు ంది। ఉఛ్చ్వాసము ఓంకారము। ఓంకారమునందు నారాయణుడు సర్వనిర్వాహకుడని, అతనికి జీవాత్ముడు దాసుడని , జీవాత్ముని లక్షణమదే అని, దాస్యమవలంబించిన జీవాత్ముడు ముక్తి కర్హుడై పరమాత్మతో యావత్కాలమును సుఖించుననే భావము గర్భితమై యున్నది।ఇది ఈ ఉయ్యాలలోనిదే।

సూర్యుడుదయించు అస్త మించు రెండు కొండలును స్తంభములయితే నక్షత్రమండల మంతయును ఈ ఉయ్యాలను మోయుచున్నది। ఈ ఉయ్యాలకు ఆకాశము అడ్డదూలము। కనుక నీ ఉయ్యాల సమస్త ప్రపంచమును నిండియున్నది।


ఉయ్యాలకు నాలుగు వేదములను బంగారు గొలుసులు।(జగత్ క్రియా కలాపములకు వేదములే ఆధారము) ఉయ్యాల పట్టి సంఖ్యాశాస్త్రము।(మూడు లోకములు , సప్తకుల పర్వతములు, త్రిగుణములు , అరిషడ్వర్గములు, చతుర్దశవిద్యలు మొదలయిన వ్యవహార మంతయు సంఖ్యాశాస్త్రము మీదనే ఆధారపడినది కనుక ఆ పట్టి సంఖ్యాశాస్త్రము)। ధర్మదేవత పీఠము।


మేఘమండలము మేలు కట్లు (బందుకట్లు)। ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగు (చాలా మేలయినది)। నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన ఆభరణము।(స్వామి యొక్క మేనిపైననే జగత్తులాధారపడియున్నవి, కనుక ఇవియే స్వామికి నగలు)।


స్తనములు కదులుచుండగా, పైటకొంగులు రాచుకొణగా స్త్రీలు ఊపే ఉయ్యాల ఇది।(భగవంతుడూపే ఈ ఉయ్యాలకు బ్రహ్మాది దేవతలు తక్కిన జీవాత్మలు కూడ సహాయ భూతులు కనుక వారు ఊపే ఉయ్యాల ఇది। అయితే వీరందరూ స్త్రీలు।"స్త్రీప్రాయమితరంజగత్ = భగవంతుడొక్కడే స్వతంత్రత కలిగిన పురుషుడు తక్కిన వారందరు భగవంతునకు పరతంత్రులు కనుక స్త్రీలే" అని శాస్త్ర నిర్ణయము। వీరు కూడ ఈ ఉయ్యాల నూపుచున్నరు కదా) ఆ స్త్రీలు బ్రహ్మాండములన్నీ ఒరిగిపోతాయనే భయంతో ఊపుచున్నారు।(జగత్ క్రియలను భగవంతుడు నిర్భయంగా చేస్తాడు , తక్కిన వారు పరతంత్రులు కనుక భయంతో చేస్తారు।)


ఈ ఉయ్యాలలో నున్న శ్రీదేవి భూదేవి ప్రతి కదలికకు నిన్ను కౌగిలించుకొందురు కదా ! స్వామీ ! దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే నీ హావభావ విలాసములు తెలుస్తాయి।


బ్రహ్మాదులకు కూడ ఇది ఆశ్చర్యకరమై వర్ణింపనలవి కాదు। కన్నుల పండువయినది। ఓ వేంకటేశ్వరా ! ఈ ఉయ్యాల ఊపుట నీకు వేడుకయిన లీల।(స్వామికు వైకుంఠము భోగము కొరకని తక్కిన లోకములు లీల కొరకని సంప్రదాయము ) ఈ పదము అన్నమయ్య గారి భావుకతకు నిదర్శనము।

http://annamacharya-lyrics.blogspot.com/search/label/lali%20patalu

click here listen song ::