3, ఆగస్టు 2010, మంగళవారం

పద్యాలు-- కృష్ణ శతకము



•అక్రూరవరద మాధవ
చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుందా
శక్రాది దివిజసన్నుత
శుక్రార్చిత నన్నుఁ గరుణ జూడుము కృష్ణా!


•అగణిత వైభవ కేశవ
నగధర వనమాలి యాదినారయణ యో
భగవంతుడ శ్రీమంతుడ
జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా!


•అనుదినము కృష్ణ శతకము
వినినఁ బఠించినను ముక్తి వేడుక గలుగున్
ధనధాన్యము గోగణములు
తనయులు నభివృద్ధిఁ బొందు దద్దయుఁ గృష్ణా!


•అపరాధ సహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముఁడనై చేసితిఁ
జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా!


•అప్పా యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు లనుభవశాలీ
యప్పా నను గనుఁగొనవే
యప్పా నను బ్రోవు వేంకటప్పా కృష్ణా!


•అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేనున్
జయ్యన గలఁగుచు నుంటిని
గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగఁ గృష్ణా!


•అల్ల జగన్నాథుకు వ్రే
పల్లియ క్రీడార్థ మయ్యెఁ బరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయుఁ
దల్లియునై చన్నుగుడిపెఁ దనరఁగఁ గృష్ణా!


•అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమగర్భమునఁ బుట్టి యాదేవకికిన్
దుష్టునిఁ గంసు వధింపవె
సృష్టిప్రతిపాదనంబు సేయఁగఁ గృష్ణా!




•ఆ దండకావనంబున
కోదండముఁ దాల్చినట్టి కోమలమూర్తీ
నాదండ గావ రమ్మీ
వేదండము కాచినట్టి వేల్పువు కృష్ణా!


•ఆదివరాహమ వయి నీ
వా దనుజు హిరణ్యనేత్రు హతుఁజేసి తగన్
మోదమున సురలు పొగడఁగ
మేదిని వడి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!




•ఇరువదొకమాఱు నృపతుల
శిరములు ఖండిచితౌర చేగొడ్డంటన్
ధరఁ గశ్యపునకు నిచ్చియుఁ
బరఁగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా!




•ఎటువలెఁ గరిమొఱ వింటివి
ఎటువలెఁ బ్రహ్లాదు కభయమిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట నిను నమ్మినాఁడ గావుము కృష్ణా!




•ఏ తండ్రి కనకకశ్యపు
ఘాతకుఁడై యతనిసుతుని గరుణను గాచెన్
ప్రీతి సురకోటి పోగడఁగ
నా తండ్రీ నిన్ను నేను నమ్మితి గృష్ణా!


•ఏ విభుఁడు ఘోరరణమున
రావణుఁ వధియించి లంకరాజుగ నిలిపెన్
దీవించి యావిభీషణు
నావిభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా!




•ఒకసారి నీదునామము
ప్రకటముగాఁ దలఁచువారి పాపము లెల్లన్
వికలములై తొలఁగుటకును
సకలార్థ యజామిళుండు సాక్షియె కృష్ణా!




•ఓ కారుణ్యపయోనిధి
నా కాధారంబ వగుచు నయముగఁ బ్రోవన్
నాకేల యితర చింతలు
నాకాధిపవినుత లోక నాయక కృష్ణా!


•ఓ పుండరీక లోచన
యో పురుషోత్తమ ముకుంద యో గోవిందా
యో పుర సంహర మిత్రుఁడ
యో పుణ్యుఁడ నన్నుఁ బ్రోవు మో హరి కృష్ణా!


•ఓ భవబంధ విమోచన
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్తకామధేనువ
ఓ భయహర నన్నుగావు మో హరి కృష్ణా!


అం

•అంగన పనుపున దోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయనొసఁగితి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా!


•అండజవాహన విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణా!


•అందఱు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ధిఁ దఱువఁ బొలుపున నీ వా
నందంబుగఁ గూర్మమువై
మందరగిరి నెత్తితౌర మాధవ కృష్ణా!


•అందెలు గజ్జెలు మ్రోయఁగఁ
జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందఱ నాడుదువు మిగుల మురియుచుఁ గృష్ణా!


•అందెలు పాదములందును
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర మునిసన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితిఁ గృష్ణా!


•అంసాలంబితకుండల
కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్
సంసారి రీతి నుండి ప్ర
శంసార్హుఁడ వైతి వహహ జగతిని గృష్ణా!



•కంటికి ఱెప్పవిధంబున
బంటుగదా యనుచు నన్నుఁ బాయక యెపుడున్
జంటయు నీ వుండుట నే
కంటక మగు పాపములను గడచితిఁ గృష్ణా!


•కందర్పకోటి సుందర
మందరధర భానుతేజ మంజులదేహా
సుందర విగ్రహ మునిగణ
వందిత మిము దలతు భక్తవత్సల కృష్ణా!


•కుంభీంద్ర వరద! కేశవ!
జంభాసురవైరి! దివిజసన్నుత చరితా!
అంభోజనేత్ర! జలనిధి
గంభీరా! నన్ను గావు కరుణను కృష్ణా!


•కుక్షిని నఖిలజగంబుల
నిక్షేపముఁజేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక వట పత్రముపై
దక్షతఁ బవళించునట్టి ధన్యుఁడ కృష్ణా!


•కెరలి యఱచేతఁ గంబము
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి
నరహరి రూపావతార నగధర కృష్ణా!


•కొంచెపు వాఁడని మదిలో
నెంచకుమీ వాసుదేవ యిభవరద హరీ
యంచితముగ నీ కరుణకుఁ
గొంచెము నధికంబు గలదె కొంతయుఁ గృష్ణా!


•క్రతువులు తీర్థాటనములు
వ్రతములు దానములు సేయ వలెనా లక్ష్మీ
పతి మిముఁ దలచిన వారికి
నతులిత పుణ్యములు గలుగు టరుదే కృష్ణా!


•క్రూరాత్ముఁ డజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందనుఁ బిలువన్
యేరీతి నేలుకొంటివి
యేరీ నీపాటి వేల్పు లెందును కృష్ణా!




•గంగ మొదలైన నదులను
మంగళముగఁ జేయునట్టి మజ్జనములకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిముఁదలఁచు సాటి రావుర కృష్ణా!


•గజరాజవరద కేశవ
త్రిజగత్కల్యాణమూర్తి దేవ మురారీ
భుజగేంద్రశయన మాధవ
విజయాప్తుఁడ నన్నుఁగావు వేగమె కృష్ణా!


•గిరులందు మేరువౌదువు
సురులందున నింద్రుఁడౌదు చుక్కలలోనన్
బరమాత్మ చంద్రుఁడౌదువు
నరులందున నృపతివౌదు నయముగఁ గృష్ణా!


•గోపాల కృష్ణ మురహర
పాపాలను బాఱఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి దయతో
నాపాలిటఁ గలిగి ప్రోవు నమ్మితిఁ గృష్ణా!


•గ్రహభయదోషము లొందవు
బహుపీడలు చేర వెఱచుఁ బాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను
తహతహ లెక్కడివి నిన్నుఁ దలఁచినఁ గృష్ణా!



•ఘనులగు ధేనుకముష్టిక
దనుజులఁ జెండాడి తౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ రేవతీపతి
యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా!




•చిలుక లొకరమణిముద్దుల
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరున్
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరఁగ మిముఁ దలఁచుజనుల కరుదా కృష్ణా!

•చుక్కల నెన్నఁగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్
జొక్కపు నీ గుణజాలము
నక్కజ మగు లెక్కపెట్ట నజునకుఁ గృష్ణా!


•చూపుము నీరూపంబును
బాపపు దుష్కృతము లెల్లఁ బంకజనాభా
పాపుము నాకును దయతో
శ్రీపతి నిను నమ్మినాఁడ సిద్ధము కృష్ణా!




•జయమును విజయున కియ్యవె
హయముల ములుకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవె తేరును
భయమున రిపుసేన విఱిగి పాఱఁగఁ గృష్ణా!




•తటతట లేటికిఁ జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణున్
ఎటువలె పుణ్యునిఁ జేసితి
వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా!


•తిరుమణి దురితవిదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణిఁ బెట్టిన మనుజుఁడు
పరమపవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణా!


•తురగాధ్వరంబుఁ జేసిన
పురుషులకును వేఱెపదని పుట్టుట యేమో
హరి మిముఁ దలఁచిన వారికి
నరుదా కైవల్యపదవి యచ్యుత కృష్ణా!


•త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్
కృపగల రాజవు భళిరే
కపటపు బుద్ధావతార ఘనుఁడవు కృష్ణా!



•దండమయా విశ్వంభర
దండమయా పుండరీక దళనేత్ర హరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకునెపుడు దండము కృష్ణా!


•దశకంఠునిఁ బరిమార్చియు
గుశలముతో సీతఁ దెచ్చికొనియు నయోధ్యన్
విశదముగఁ గీర్తి నేలిన
దశరథరామావతార ధన్యుఁడ కృష్ణా!


•దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వ రయ్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా!


•దివిజేంద్రసుతునిఁ జంపియు
రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై
దివిజేంద్రసుతునిఁ గాచియు
రవిసుతుఁ బరిమార్చితౌర రణమునఁ గృష్ణా!


•దుర్జనులగు నృపసంఘము
నిర్జింపఁగఁ దలచి నీవు నిఖిలాధారా
దుర్జనులను వధియింపను
నర్జును రధచోదకుండ వైతివి కృష్ణా!


•దుర్భర బాణము రాఁగా
గర్భములోనుండి యభవ కావు మటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా!


•దుర్మతిని మిగుల దుష్టపుఁ
గర్మంబులఁ జేసినట్టి కష్టుఁడ నన్నున్
నిర్మలునిఁ జేయవలె ని
ష్కర్ముఁడ నిను నమ్మినాను సతతము కృష్ణా!


•దుర్వార చక్రధరకర
శర్వాణీ భర్తృవినుత జగదాధారా
నిర్వాణనాథ మాధవ
సర్వాత్మక నన్నుఁగావు సరగున కృష్ణా!


•దుష్టుండ ననాచారుడఁ
దుష్టచరిత్రుడను చాల దుర్బుద్ధిని నేఁ
నిష్ఠ నిను గొల్వనేరని
కష్టుడ నగు నన్ను కావు కరుణను కృష్ణా!


•దేవేంద్రుఁ డలుకతోడను
వావిరిగా ఱాళ్ళవాన వడిఁ గురియింపన్
గోవర్ధనగిరి యెత్తితి
గోవుల గోపకులఁ గాచు కొఱకై కృష్ణా!



•నందుని ముద్దుల పట్టిని
మందరగిరి ధరుని హరిని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
వందితు నిను దలతు భక్తవత్సల కృస్ణా!


•నరపశువ మూఢచిత్తుఁడ
దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ
గుఱు తెఱుఁగ నెంతవాఁడను
హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణా!


•నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవ వైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా!


•నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా!


•నీ నామము భవహరణము
నీ నామము సర్వసౌఖ్య నివహ కరంబున్
నీ నామ మమృత పూర్ణము
నీ నామము నేఁదలంతు నిత్యము కృష్ణా!


•నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!



•పంచేంద్రియ మార్గంబులఁ
గొంచెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడె కృష్ణా!


•పదియాఱువేల నూర్వురు
సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్
విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను గృష్ణా!


•పదునాలుగు భువనంబులు
కుదురుగ నీ కుక్షి నిల్పుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టులొదిగి యుంటివి కృష్ణా!


•పరనారీ ముఖపద్మము
గుఱుతుగఁ గుచకుంభములను గొప్పును నడుమున్
అరయఁగఁ గని మోహింతురు
నిరతము నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా!


•పరులను నడిగిన జనులకు
కుఱుచ సుమీ యిది యటంచు గుఱుతుగ నీవున్
గురుచఁడవై వేఁడితి మును
ధరఁ బాదత్రయము బలిని దద్దయుఁ గృష్ణా!


•పరుసము సోకిన యినుమును
వరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి నీ నామము సోకిన
సురవందిత నేను నటుల సులభుఁడ గృష్ణా!


•పాణితలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయఁగఁ బింఛం
బాణీముత్యము ముక్కున
నాణెముగాఁదాల్చు లోక నాథుఁడ కృష్ణా!


•పాలను వెన్నయుఁ మ్రుచ్చిల
ఱోలను మీ తల్లి కట్ట రోషముతోడన్
లీలావినోది వైతివి
బాలుఁడవా బ్రహ్మఁగన్న ప్రభుఁడవు కృష్ణా!


•పురుషోత్తమ లక్ష్మీపతి
సరసిజగర్భాది మౌనిసన్నుత చరితా
మురభంజన సురరంజన
వరదుఁడ వగు నాకు భక్త వత్సల కృష్ణా!



•బలమెవ్వఁడు కరిఁ బ్రోవను
బలమెవ్వఁడు పాండు సుతుల భార్యను గావన్
బలమెవ్వఁడు రవిసుతునకు
బలమెవ్వఁడు నాకు నీవ బలమౌఁ గృష్ణా!


•బృందావనమున బ్రహ్మా
నందార్భకమూర్తి వేణు నాదము నీ వా
మందార మూలమున గో
విందా పూరింతువౌర వేడుకఁ గృష్ణా!



•భద్రార్చిత పదపద్మ సు
భద్రాగ్రజ సర్వలోక పాలన హరి శ్రీ
భద్రాధిప కేశవ బల
భద్రానుజ నన్ను బ్రోవు భవహర కృష్ణా!


•భారద్వాజసగోత్రుఁడ
గారవమున గంగమాంబ కరుణాసుతుఁడన్
పేర నృసింహాహ్వయుఁడను
శ్రీరమయుత నన్నుఁగావు సృష్టినిఁ గృష్ణా!



•మందుఁడ నే దురితాత్ముఁడ
నిందల కొడిఁగట్టినట్టి నీచుని నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి గృష్ణా!


•మగమీనమవై జలనిధిఁ
బగతుని సోమకునిఁ జంపి పద్మభవునకున్
నిగమముల దెచ్చి యిచ్చితి
సుగుణాకర మమ్ముఁ గరుణ జూడుము కృష్ణా!


•మడుగుకుఁ జని కాళీయుని
పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయన్
గడువేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా!



•యమునకు నిఁక నే వెఱువను
కమలాక్ష జగన్నివాస కామితఫలదా
విమలమగు నీదు నామము
నమరఁగఁ దలఁచెదను వేగ ననిశము కృష్ణా!



•రఘునాయక నీ నామము
లఘుమతితోఁ దలఁపఁగలనె లక్ష్మీరమణా
లఘములఁ బాపుము దయతో
రఘురాముఁడ వైన లోక రక్షక కృష్ణా!



•వడుగువునై మూఁడడుగుల
నడిగితివౌ భళిర భళిర యఖిలజగంబుల్
తొడిగితివి నీదు మేనునఁ
గడు చిత్రము నీ చరిత్ర ఘనుఁడవు కృష్ణా!


•వనజాక్ష భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై
కన నీ సద్గుణజాలము
సనకాది మునీంద్రులెన్నఁ జాలరు కృష్ణా!


•వలపుగల తేజి నెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనులఁ ద్రుంపన్
కలియుగము తుదను వేడుక
కలికివిగా నున్న లోకకర్తవు కృష్ణా!


•వారిజ నేత్రలు యమునా
వారిని జలకంబులాడ వచ్చిన నీ వా
చీరలు మ్రుచ్చిలి యిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా!


•వావిరి నీ భక్తులకున్
గావరమున నెగ్గు సేయు గర్వాంధులకున్
దేవ వధించుట వింటిని
నీ వల్లను భాగ్యమయ్యె నిజముగఁ కృష్ణా!


•విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపఁ దలఁచి విష్ణుఁడ వనగా
విశ్వము జెఱుపను హరుఁడవు
విశ్వాత్మక నీవె యగుచు వెలయుదు కృష్ణా!


•వేదంబులు గననేరని
యాది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నాదిక్కుఁ జూచి కావుము
నీ దిక్కే నమ్మినాఁడ నిజముగఁ గృష్ణా!



•శక్రసుతుఁ గాచు కొఱకై
చక్రము చేపట్టి భీష్ముఁ జంపఁగ చను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రాగ్రహ సర్వలోక నాయక కృష్ణా!


•శతకోటి భానుతేజా
యతులిత సద్గుణగణాఢ్య యంబుజనాభా
రతినాథజనక లక్ష్మీ
సతిహిత ననుఁ గావు భక్త వత్సల కృష్ణా!


•శిరమున రత్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపుఁ బతకము
సిరినాయక యమరవినుత శ్రీహరి కృష్ణా!


•శుభ్రమగు పాంచజన్యము
నభ్రంకషమగుచు మ్రోవ నాహవభూమిన్
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగులఁజేయు ఘనుడవు కృష్ణా!


•శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారకనిలయ జనార్దన
కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా!


•శ్రీ లక్ష్మీ నారాయణ
వాలాయము నిన్నుఁ దలఁతు వందితచరణా
ఏలుము నను నీ బంటుగఁ
జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా!


•శ్రీధర మాధవ యచ్యుత
భూధర పురుహూతవినుత పురుషోత్తమ నీ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా!



•సుత్రామనుత జనార్థన
సత్రాజిత్తనయనాథ సౌందర్యకళా
చిత్రావతార దేవకి
పుత్రా ననుఁగావు నీకు బుణ్యము కృష్ణా!


•స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయన్
అంభోజనేత్ర జలనిధి
గంభీరుఁడ నన్నుఁ గావు కరుణను గృష్ణా!



•హరి నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
బరమేష్టి సురలు పొగడగ
కరిగాచినరీతి నన్ను కావుము కృష్ణా!


•హరి సర్వంబునఁ గలఁడని
గరిమను దైత్యుండు పలుకఁ గంబములోనన్
ఇరవొంది వెడలి చీల్చవె
శరణనఁ బ్రహ్లాదుడిందు సాక్షియె కృష్ణా!


•హరిచందనంబు మేనునఁ
గరమొప్పెడు హస్తములను గంకణ రవముల్
ఉరమున రత్నము మెఱయఁగఁ
బరఁగితివౌ నీవు బాల ప్రాయము కృష్ణా!


•హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్త్వము
హరి హరి పొగడంగవశమె హరి శ్రీ కృష్ణా!


•హా వసుదేవ కుమారక
కావుము నా మాన మనుచు కామిని వేఁడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీవర యక్షయ మటంచు జీరలు కృష్ణా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి