24, ఆగస్టు 2010, మంగళవారం

మన తెలుగు భాష వయసెంత?

క్రీ.శ. 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజైన హాలుని "గాధా సప్తశతిలో తెలుగు పదాలున్నాయి. కాబట్టి 1వ శతాబ్దం నాటికే తెలుగు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. నన్నయకు ముందు వెయ్యి సంవత్సరాలనాటికే తెలుగు ఒక స్వతంత్ర భాషగా విరాజిల్లిందనడానికి శాసనాధారాలున్నాయి. ఐతే నన్నయ ఆ వ్యవహార భాషను సంస్కరించి తెలుగు భాషకు ఓ రూపాన్ని ఇవ్వగలిగాడు.

క్రీ.శ. 200 లోని అమరావతి శిలాశాసనంలోని "నాగబు" పదంలోని "బు" ప్రత్యయాన్ని మొట్టమొదటి తెలుగు అక్షరంగా భాషా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడులో చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటి చోళుడైన ధనుంజయుడు వేయించిన శాసనం (క్రీ.శ.575-600) , కలమళ్ళ (క్రీ.శ.575-600) శాసనాలు మొట్టమొదటి శిలాశాసనాలుగా భావింపబడుతున్నాయి. అదేవిధంగా క్రీ.శ. 848లోని పండరంగని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనాల్లో పద్యాలున్నాయి.


ధనంజయుని కలమళ్ళ శాసనము

..........
కల్ము[తు]రా
జు ధనంజ
యుదు రేనా
ణ్డు ఏళన్
చిఱుంబూరి
రేవణకాలు [పం]
పు చెనూరుకాజు
అఱి కళా ఊరి [-]
ణ్డవారు ఊరి ... ...
... ....
..... ... పఞ్చ [మ]
హా పాతకస
కు


***ఎరికల్ మహారాజు ధనంజయుడు రేనాడును ఏలుతుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనే ఉద్యోగి పంపున చెనూరు గ్రామానికి చెందిన 'కాజు' (వాక్యం అసంపూర్ణం) - ఈ ధర్మం చెడగొట్టువాడు పంచమహాపాతకుడగును - అని కావచ్చును

పండరంగని అద్దంకి శాసనము (క్రీ.శ. 848) - అద్దంకి

తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది.

పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
బలగర్వ మొప్పగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు బండరంగు
బంచిన సామంత పదువతో బోయ
కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి
గొఱల్చియ త్రిభువనాంకుశ బాణ నిల్చి
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.



యుద్ధమల్లుని బెజవాడ శాసనము (క్రీ.శ. 930) - విజయవాడ

స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర
విస్తర శ్రీయుద్ధమల్లుం డనవద్య విఖ్యాతకీర్తి
ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల
వస్తు సమేతుండు రాజసల్కి భూవల్లభుం డర్థి.


పరగంగ బెజవాడ గొమరుసామికి భక్తుడై గుడియు
నిరుమమమతి నృపధాము డెత్తించె నెగిదీర్చె మఠము
గొరగల్లా కొరులిందు విడిసి బృందంబు గొనియుండువారు
గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు.



కొరివి శాసనం - (క్రీ.శ. 930) - వరంగల్ జిల్లా మానుకోట:

కొరివి గద్య శాసనము తూర్పు చాళుక్యులు మరియు రాష్ట్రకూటులకు చెందిన ముగ్గురు సామంత రాజుల మధ్య జరిగిన పోరాటమును తెలియజేస్తుంది. తెలుగు వచనములో పటిష్టమైన రచన దీనిలో కనిపిస్తుంది.

శ్రీ విక్రమాదిత్య నృపాగ్ర తనయుండైన చాళుక్య భీమునకు శౌచకందర్పునకుం వేగీశ్వరునకు రణమర్దాన్వయ కులతిలకుండైన కుసుమాయుధుండు గన్నరబల్లహుని కస్తప్రాప్తంబైన రణమర్దన కండియందన భుజనీర్య బలపరాక్రమంబున దెచ్చి ... శ్రీ నిరవద్యుం డనేక సమరసంఘట్టన భుజాసి భాసురుడై తమయన్న రాజశ్రీకెల్లం దానయర్హుండై నిల్చి.


గూడూరు శాసనము - (క్రీ.శ. 1124) - జనగామ తాలూకా, గూడూరు

అరుదగునట్టి ఎఱ్ఱనృపు నంగన గామమ సాని యాక మే
ల్గరదని బేతభూవిభుని గాకతి వల్లభుచేసి వాని దా
బరగంగ జేతబెట్టి ఘను బల్లవరాయని యాగిజొచ్చె భా
స్కర విభు చక్రవర్తి గని కాకతి నిల్పుట కోటిసేయదే !



హన్మకొండ శాసనము (క్రీ.శ. 1163)


వేయి స్తంభాల గుడి లోని రుద్రదేవుని శాసనము చరిత్ర, భాషా కావ్యరచనా విషయాలలో ముఖ్యమైన శాసనము. ఇది చాళుక్యుల తర్వాత కాకతీయులు స్వాతంత్ర్యము వహించుటకు కారణమైనది. ఇందులో అనేక విజయముల గురించి రమ్యమైన భాషాశైలిలో చెప్పబడినది.

హస్త్యారోహణ కర్మ కర్మఠగతిం చాళుక్య చూడామణిం
శశ్వద్యుద్ధ నిబద్ధ గహ్యరమతిం యుద్ధే బబంధ క్షణాత్
కృద్ధేనోద్ధుర మంత్రకూటనగరీ నాథో థయో నిస్త్రపో
గుండః ఖండిత ఏవ ముండితశిరః క్రోడాంక వక్షఃస్థలః
కందూరోదయ చోడ వంశ విలసత్ క్షీరాబ్ధిగర్భోద్భవ
త్పద్మైకాశ్రయ రుద్రదేవనృపతేః కింవర్ణ్యతే విక్రమః


తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలమైన 16వ శతాబ్దం స్వర్ణయుగం.

సంస్కృత భాష ప్రాబల్యం నుండి బయటపడేందుకు తెలుగు భాష ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. వైదిక భాషల్నీ, వైదిక భావజాలాన్నీ ప్రతిఘతించడంలో ద్రవిడ జాతులందరికంటే తెలుగువారే ప్రముఖ పాత్ర వహించారు. ఎట్టకేలకు వాడుక భాషను సాధించారు. ప్రస్తుతం వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం మనకు లభ్యమవుతోంది.

"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.

చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది.

తెలుగులో 20వ శతాబ్దంలోనే ఎక్కువ సాహిత్యం వచ్చింది. ఇంతకుముందులేని సాహిత్య ప్రక్రియలెన్నో ఈ శతాబ్దంలో వికసించాయి. అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు చెందినవారు రచయితలయ్యారు.

అనేకమంది కవుల కృతులతో ఆంధ్ర భాష అలరారింది. ఆచార్య భద్రిరాజు క్రుష్ణమూర్తి ఆధ్వర్యంలో 1,08,330 పదాలతో కూడిన తెలుగు వ్యుత్పత్తి పదకోశం 8 సంపుటాలుగా ఆంధ్ర యూనివర్సిటిచే ప్రచురించబడింది. ఇంగ్లీషు తరువాత తెలుగు భాషకే ఇంతటి కోశ సంపద ఉంది.

3 కామెంట్‌లు:

  1. మంచి వ్యాసం, ఎన్నో విషయాలు తెలిసాయి. ధన్యవాదములు!

    రిప్లయితొలగించండి
  2. తెలుగు వ్యుత్పత్తి పదకోశం గురించి ఒక చిన్న సవరణః
    * శ్రీ లకంసాని చక్రధరరావు గారు (ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్) సంపాదకత్వంలో "తెలుగు వ్యుత్పత్తి కోశం " తెలుగు నుండి తెలుగుకు 108330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడింది. యూనివర్సిటీ గోడౌన్లో ఆ నిఘంటువులు ఉన్నాయి. వీలైతే వాటిని నెట్ లోకి తేవాలి:
    * 1.అ-ఔ (1978) 412 పేజీలు పొట్టి శ్రీరాములు గారికి అంకితం.ఎమ్.ఆర్.అప్పారావు తొలిపలుకులు.12219 పదాలు.
    * 2.క-ఘ(1981) 455 పేజీలు కట్టమంచి రామలింగారెడ్డి గారికి అంకితం. ఆవుల సాంబశివరావు ముందుమాట.19670 పదాలు
    * 3.చ-ణ (1981) 277 పేజీలు ఆవుల సాంబశివరావు ముందుమాట.11000 పదాలు
    * 4.త-న (1985) 440పేజీలు వాసిరెడ్డి శ్రీకృష్ణ గారికి అంకితం.కోనేరు రామకృష్ణారావు మున్నుడి.16000 పదాలు.
    * 5.ప-భ (1987) 498 పేజీలు లంకపల్లి బుల్లయ్య గారికి అంకితం.కోనేరు రామకృష్ణారావు మున్నుడి.19000 పదాలు.
    * 6.మ (1987) 268 పేజీలు ఎమ్.ఆర్.అప్పారావు గారికి అంకితం కోనేరు రామకృష్ణారావు ముందుమాట.9754 పదాలు
    * 7.య-వ (1989) 272 పేజీలు ఆవుల సాంబశివరావు గారికి అంకితం కనిశెట్టి వెంకటరమణ తొలిపలుకు.10132 పదాలు
    * 8.శ-హ (1995) 315 పేజీలు కోనేరు రామకృష్ణారావు గారికి అంకితం మద్ది గోపాలకృష్ణారెడ్డి ప్రవచనం 6651పదాలు 3904(అ-హ) అనుబంధం.

    రిప్లయితొలగించండి