3, ఆగస్టు 2010, మంగళవారం

జానపద సాహిత్యము గురించి

కూని రాగాలాపనతో ప్రకృతి లయకు అనుగుణంగా వచ్చిన గానం భాషా సంపర్కంతో గేయంగా రూపొంది మానవ మనుగడకు సంబంధించిన వివిధి దశలకు రూపులో మార్పు, కూర్పులో చేర్పులు పాత ఒరవడిలో కొత్త పదములు కొత్తజీవనానికి పాత బాణీ మొదలగు చేర్పులు, మార్పులు కూర్పులతో నిత్యం సరికొత్త రూప సాక్షాత్కారమిచ్చే జానపద వాజ్ఞ్మయం నిత్యనూతనమైందిగా ప్రశస్తికెక్కినది. జానపద వాజ్ఞ్మయం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. మౌఖిక సంప్రదాయంలో జీవించడం మూలంగా దీనికి ఒక క్రమమైన పరిణత స్వరూపు కానరాము. వినుకలియే సాధనంగా మనుగడ సాగిస్తాయి కనుక జానపదుల కవుల కల్పనా పటిమలొ ఒక పదానికి మరో పదము, ఒకపాద పంక్తికి మరో పదసంపుటి సమాహారం. ఒక సన్నివేశమునకు మరో రసఘటిక, ఒక పదకేళికి ధీటుగా మరో ప్రహేళిక, ఒక సామెతలొ మరో సామెత, ఒక కధలో మరో సాంఘిక ఆచారము ఒక కోలాటంపాటలొ మరో భావకెరటం కాలానుగుణంగా కవి భావనా వీచికాలను సంథానంగా మారుతూ కొత్త చవులను విరజ్జిల్లుతుంది జానపద సాహిత్యము.

శిష్టసాహిత్యంలో కవి నైపుణ్యానికి కవితాగుణ మాధుర్యానికి ఉదాత్త పాత్ర చిత్రణకు, రణపోషణకు, ఇతివృత్త స్వీకారమునకు పొంతన ఉంటుంది. అనగా కవి నిరంకుశుడనే మాట ఉన్నా అతని కవిత్వము కొన్ని పరిధులకు లొంగి ఉంటుంది. జానపద సాహిత్యమైతే ఒక ప్రత్యేకమైన కవి ఉండడు. మౌఖిక సంప్రదాయములో జీవిస్తుంది గనుక ఒక స్వరూపము గాని శాశ్వత పదపోహళింపుగాని కనపడదు. ఒక తరం నుండి మరో తరానికి సంక్రమిస్తూ నిత్యనూతనముగ దర్శనమిచ్చే జానపద సాహిత్యం స్వేచ్చా విహారిణి. అనగా విచ్చలవిడిగా న్వైరవిహారము చేసేదని మాత్రము కాదు. సాంప్రదాయకపు కట్టుబాట్లకి లొంగక పని పాటల క్రమమునకు మాత్రము ఒదగి ఆ లయ కనుగుణంగా సాంఘిక జీవన ప్రతిఫలమునకు జాతి సంస్కృతి ఆచార సంప్రదాయములు, మత విశ్వాసములు, మూఢనమ్మకాలు మొదలగు అంశములను కళ్ళకు కట్టినట్లు కనబరుస్తూ తరువాతి తరాలవారికి మనోహరంగా దర్శనమిచ్చేది జానపద సాహిత్యము. మానవుడి మనసులోని భావముకు శాబ్దికరూప సందర్శనమే జానపద సాహిత్యం. దీనిపై ఏ సిద్ధాంతముల ప్రభావము ఉండదు. ఉచ్చ్వాస నిశ్వాసములవలె ప్రకృతి శోభల రసస్రవంతిల మృదుమధురంగా సాగేదే జానపద సాహిత్యం. దీనికి ఏ చందశ్శాస్త్రము, ఏ వ్యాకరణము, ఏ అలంకారిక శాస్త్రము అడ్డురాదు. ఏ సూత్రములు నిర్ధేశించలేవు. చేసే పనితూగునకు ఆడే ప్రతి ఆట విశ్వామునకు ఊపే ప్రతి ఊయల ఊపునకు, ఊరడించే ప్రతి తల్లి గొంతు ఒరవడికి, ఊరడిల్లే ప్రతి శిశువు కేరింతకు, ఊకొట్టే మనవడి హృదయస్పందనకు రూపుగొల్పే అమ్మమ్మ తాతగార్ల కధా కధన సంవిధానికి అనుగుణమైన ఆయా లయల హోయలులో ఒదిగిన పదబంధ విన్యాసమే జానపద సాహిత్యము, అంటే చేసే పని లయకు సంధించి మాత్రమే జానపద వాజ్ఞ్మయం పుడుతుందని అర్ధము. అంతేగాని న, జ, భ,జ,జ జ, రాది మొదలగు గణములచే స్వరూపం సంతరించుకున్నది మాత్రము కాదు. అలంకారికుల మతమునకు అనుసరించి వచ్చేది శిష్టసాహిత్యం అవుతుంది. ఈ సాహిత్యమునకు ఏ లక్ష్ణములున్నవో తెలుసుకోవడామే మన వంతు కాని ఏ సామెతకు ఈ లక్ష్ణముండవలెను, ఈ పొడుపు కధను ఈ విధముగనే పాడవలెను, ఈ గేయము ఈ విధముగనే పాడవలేననే నియమము లేదు. విధించే హక్కు ఎవరికిని లేదు. ప్రకృతిలో పూచి, కాచి, పండిన అమృతఫలాన్ని తనివితీరా అనుభవించడం ఎటువంటిదో జానపద సాహిత్యాన్ని తనివితీర్చుకోవడం అటువంటిదే. అనగా జానపద సాహిత్యము ప్రకృతి నిసర్గ మనోహరమైన సౌందర్యరాశి అని గమనించాలి.

జానపద వాజ్ఞ్మయాన ప్రశస్తమైన స్ధానము సముపార్జించుకున్నది జానపద గేయము. అసలు జానపద వాజ్మయమంటే గేయమే చాలామంది స్ఫురణకు వస్తుంది. సాహిత్యములోని మిగతా ప్రక్రియలకంటే జానపద గేయానికి ఉచ్ఛ స్ధానము ఉండటానికి గల కారణం దానికి గల గానయౌగ్యతయే. 'సంగీతమపి సాహిత్యం సరస్వత్తాంతనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలొచనామృతం ' అనికదా ఆర్యోక్తి. ఇది జానపద గేయమునకు సర్వవిధాలా సరిపోతుంది. సాహిత్యం భావాశ్రితమైతే గేయం గానానుకూల్యమైనది. అనగా గేయమున సాహిత్యపరమైన పదబంధముతో పాటు సంగీతపరంగా గానానుసంధానము కూడా కలదు. కాబట్టి సంగీత సాహిత్యముల కంటే గేయ ప్రక్రియకు వన్నె తెచ్చిన విషయాలలొ సంగీతాశ్రయమనేదే ముఖ్య గుణము.

ఇతర జానపద వాజ్ఞ్మయ శాఖలకంటే ; గేయశాఖ జానపదుల జీవికతో ఎక్కువ ముడిపడి ఉంది. జానపదుల దైనందిన కార్యక్రమాల అన్నింటితోను పెనవేసుకొని ఉన్న గేయము శాఖోవశాఖలుగా ప్రవల్లినది. స్త్రీ పురుష బాల వృద్ధ భేదములతో సంబంధము లేక అన్ని వయసులవారి నోళ్ళలో నిత్యమూ నానుతూ నవనవోన్మేషశాలినిగా కొత్త పుంజులతో హొయలు సనలు వెలార్చుతూ ఉంటుంది. కనుక అన్ని భేదములతో జానపద గేయము మనకు గోచరమవుతుంది. స్ధానిక ఘట్టములేగాక పౌరాణికేతి వృత్తములు, వీరుల తలపోతలు, అద్భుత సన్నివేశములు, దేవతా మహాత్మ్యములు, పేరంటాళ్ళ మహాత్మ్యములు మొదలగునవెన్నో సందర్భములు, సన్నివేశములు చోటుచేసుకునే వున్నాయి. గేయగాధలు, వీరగాధలు, అద్భుత గాధలు మొదలగు విధమగా కధాసహిత గేయ పాయగా ఒక ప్రత్యేకమైన స్ధితిని సంతరించుకున్నవి అప్పటికప్పుడు అలవోకగా ఆయా సందర్భములను అసరాగా, ఆలంబనగా చేసుకొని అను నిత్యము కొత్త అందాలను పంచిపెట్టే చిన్న చిన్న గేయాల సంఖ్యే ఎక్కువ. వీటిలో ఏ రకమైన ఇతి వృత్తము చోటుచేసుకోదు. కాని సన్నివేశాల ఆధారంగా సెలయేరు గలగలతో తెప్పలు తెప్పలుగా కుప్పలు కుప్పలుగా శరపరంపరగా వుడుతూ ఉంటాయి.ఈ చిన్న గేయములు. చల్‌ మోహనరంగా. సిరిసిరిమువ్వా, తుమ్మెద పదాలు, వెన్నల పదాలు, గొబ్బి పదాలు, నక్కలోల్ల చిన్నది, గాజులదాన్ గాజులదాన్, వంకీల జుట్టుదానా, కిర్రుజోళ్ళ చిన్నోడు లాంటి గేయాలెన్నో కోకొల్లలు.

జానపద గేయం వైవిధ్యము గల ప్రక్రియ. ఇటు కధా గేయాలకెంత ప్రాధాన్యముందో అటు కధారహిత గేయాలకు అంతే ప్రచారమున్నది. ఆచార్య బి. రామరాజుగారి అధ్యయనమే ఇప్పటికి శిరోధార్యమైంది. వీరి ప్రకారము జానపద గేయము



1.పౌరాణిక గేయాలు
2. చారిత్రక గేయాలు
3. మతసంబంధ గేయాలు
4. పారమార్ధిక గేయాలు
5. స్త్రీల పాటలు
6. శ్రామిక గేయాలు
7. పిల్లల పాటలు
8. శృంగార గేయాలు
9. అద్భుత రసగేయాలు
10. కరుణరస గేయాలు
11. హాస్యరస గేయాలు.



పౌరాణిక గేయములు:-

వీటిని మరల మూడు ముఖ్యమైన భేదాలుగా విభజించవచ్చు.అవి రామయణ భారత భాగవత సంబంధాలు.

శ్రీరామ పట్టాబిషేకము, ఊర్మిళదేవి పాట, లక్ష్మణదేవనవ్వు పాట, సీతమ్మ అగ్ని ప్రవేశము, కోవెల రాయబారము మొదలగునవి రామాయణ సంబంధములుగాను, సుభద్ర కల్యాణము, శశిరేఖా పరిణయము, విరాటపర్వాంతర్గత కీచక వధ మొదలగునవి భారత సంబంధములుగాను, శ్రీకృష్ణ జననము, కాళిందిమడుగు, గుమ్మడిపాట, రుక్మిణిదేవి కల్యాణము, రుక్మిణిదేవి సీమంతము, కుచేలోపాఖ్యానము మొదలగునవి భాగవత సంబంధ గేయములుగా అనసూయదేవి బ్రతుకమ్మ పాట, దత్తాత్రేయ జననము, గోవుపాట మొదలగునవి కూడా పౌరాణికములే.

చారిత్రక గేయములు:-

విపుల వర్ణలతోను విస్తృత ప్రచారములోను ఉండడమే గాక వీరుల చారిత్రక ఘట్టములకు ప్రాధాన్యత వహించిన సుదీర్ఘములైన గేయములను చారిత్రక గేయాలని చెబుతారు. వీటినే వీర గాధలని జానపద విజ్ఞాన పరిధిలో చెపుతారు. ఇవి మహావీరగాధలు, లఘువీర గాధలని రెండు విభాగములు. ఆంధ్రదేశమున పౌరుషాగ్నులు రగిల్చిన పలనాటి వీరుల గాధలు 'పలనాటివారి సుద్దులు' గా ఇప్పటికీ పాడుకుంటూనే ఉన్నారు మన జానపదులు. అందులోని బాలచంద్రుని యుద్ధ ఘట్టము అమిత ప్రచారం పొందింది.. కోళ్ళ పోట్లాట, కన్నమనేని యుద్ధము, గురజాల యుద్ధము, అలరాజు రాయబారము, కొమ్మనాయుని యుద్ధము, బ్రహ్మనాయుని విరుగు మొదలగు ఘట్టములు ఆంధ్ర ప్రజానీకము నాలుకల పై నిత్యము నానుతూనే ఉన్న గాధలు పలనాటి వీరచరిత్రను లిఖించినది శ్రీనాధుడే. పలనాటి వీరచరిత్ర పేరుతో నేటికి ఎన్నో నాటకములు.బుర్రకధలు మొదలగు ప్రక్రియ భేదములతో దిగ్దిగంతముల పలనాటి విరుల పరాక్రమౌపేత సన్నివేశములు మారుమ్రౌగుచునే ఉన్నాయి. అదేవిధముగా కాటమ రాజు కధ, సర్వాయి పాపని కధ, వేసంగిరాజు కధ, అల్లూరి సీతారామరాజు కధ, బంగారు తిమ్మరాజు కధ, ఆరు మరాటీల కధలు విపుల ప్రచారమునందినవే. బొబ్బిలి కధ, తాండ్రపాపారాయని తళతళల బాకు వాదరను ఆంధ్ర ప్రజానీకము నిత్యము స్మరించుకుంటూనే యున్నారు,

మత సంబంధ గేయములు :-

వీటిని మరల శైవ వైష్ణవాలుగా విభజించడం జరిగింది. గంగా వివాహము, గంగా గోరి సంవాదము, సవతుల కయ్యము,సురాభాండేశ్వరము మొదలగునవి శైవసంబంధములు, లక్ష్మీదేవి సొగటా లాట, వేంకటేశ్వరుల వేట, చెంచీత కధ, చిన్నను కధా ముదలగునవి వైష్ణవమత సంబంధ గేయ కోవలోకి వస్తాయి.

పారమార్ధికములు :-

ఇవి మరల మూడు భేదములు. భద్రాచల రామదాసు కీర్తనలు, కాలేమస్తాను దేవుని కీర్తనలు, రాపాక కవుల కీర్తనలు, కోలాట కీర్తనలు మేలుకొలుపులు, మంగళహారతులు భక్తిగేయములుగను ఏగంటివారి వచనములు వేమన తత్త్వము, రామదాసు శతకము, పోతులూరి వీరబ్రహ్మం తత్త్వములు, తారకమృతసారము, ి వేదాంత సంబంధములుగా నోములు, వ్రతములు, తులసీదళము పాట, రామేశ్వరము పాటలు, ఏకాదశి వ్రతంపాట, బ్రతుకమ్మ పాటలు, ఎల్లమ్మ కధలు మొదలగునవి కర్మమార్గానికి సంబంధించిన గేయములుగా వర్గీకరింపబడ్డాయి.

స్త్రీల పాటలు :-

లాలి పాటలు, జోలపాటలు, పెళ్ళి పాటలు, సీత సమర్త, సీతనత్తవారింటికి పంపుట, సీత గడియ, సీతమ్మ వారి వసంతం, సీతాదేవి వామనగుంతలాడు పాట, సుభద్ర సారె, అత్తాకోడండ్రు ఆరళ్లు మొదలగునవి ఈ శాఖలలో వివరింపబదినవి.

శ్రామిక గేయములు :-

పడవ పాటలు, రాట్నము పాటలు, తిరుగలి పాటలు, రోకటి పాటలు, ఏతముపాట, మోట పాట ,ఏరువాక. పొలి మొదలగు కృషివళుల పాటలు, కార్మికుల పాటలు, వృత్తుల పాటలు మొదలగునవన్నీ ఈ కోవలోకి వస్తాయి.

పిల్లలు పాటలు :-

పిల్లల కొరకు ఉద్దేశింపబడిన పాటలు, పిల్లలు తామే అల్లుకొన్న పాటలు, ఆటపాటలు పాటలు గేళిచేయు పాటలు మొదలగునవి.

శృంగార గేయాలు :-

వెంకయ్య చంద్రమ్మ పాట, చల్ మోహనరంగ, సిరిసిరిమువ్వ పదము, గోంగూర పాట, నారాయణమ్మ పాట, బంగారుమామపాట, కోలాటపాటలు, కామినిపాటలే గాక పౌరాణిక చారిత్రక, కరుణ, అద్భుత, రస ప్రధాన గేయములు మతసంబంధ గేయములలోన శృంగార రస ఘట్టములు మొదలగునవి.

అద్భుతరస గేయాలు :-

బాలనాగమ్మ కధ, కమ్మవారి పణత, పనల బానరాజు కధ,గాంధారి కధ, కాంభోజరాజు కధ, ధర్మాంగద చరిత్ర, పాము పాట బాలరాజు బతుకమ్మ పాట మొదలగునవి.

కరుణరస గేయాలు :-

కామమ్మ కధ, లక్ష్మమ్మ కధ, సన్యాసమ్మ కధ, వీరరాజమ్మ కధ, ఎరుకలనాంచారి కధ మొదలగునవి.

హాస్యపు పాటలు :-

పౌరాణిక, చారిత్రక, మతగేయములందున్న హాస్య సన్నివేశములు, హాస్యానుకృతులు, వాక్ చమత్కృతి గల కొన్ని పాట ఈ కోవలోనికి వస్తాయి.

ఈ సందర్భంగా ఒక్క అంశమును మాత్రము చర్చించుకోవలసి ఉంది, మొత్తం జానపద గేయములు నన్నింటినీ రెండే రెండు విభాగములుగా విభజించవచ్చును. 1. శ్రామిక గేయాలు 2.శ్రామిక గేయేతరములు. ఎందుచేతనంటే నూటికి 70 మంది జన పదాలలొ శ్రామికులుగా వివిధ వృత్తులు చేపట్టిన కార్మికులుగా ఉన్నవారే.

జానపద గేయములలో సగానికి పైనే శ్రామిక గేయములున్నవని వాటికి మరింత విరివిగా సేకరించి ఆదరించాల్సిన అవసరం ఉందని అదే అసలుసిసలైన జానపద గేయమనేది కూడా నిర్ధారణకు వచ్చిన విషయము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి