3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

రాక్షసగుళ్ళు(కెయిరనులు)

తెలుగు భాష మరియు ప్రాచీన ఆంద్రుల సంస్కృతీ,విశేషాలు గురించి మనకు రకరకాల ఆధారాలు ఉన్నవి .అవి శాసనాలు,నాణేలు,సాహిత్య ఆధారాలు,కైఫీయతులు,కెయిరనులు లేదా రాక్షసగుళ్ళు మొదలైనవి.అందులో కెయిరనులు లేదా రాక్షసగుళ్ళు గురించి తెలుసుకుందాం.


కెయిరనులంటే పూర్వకాలపు సమాధులు .భుగర్బాన్ని తవ్వడం వళ్ళ ఇవి బయల్పడుతాయి.కేయిరనులు రాయలసీమలోనూ,తెలంగాణా ప్రాంతాలలోను ఎక్కువగా కనిపిస్తాయి.ఒక పెద్ద గుంతతీసి,అందులో రాతి పలకలతో చిన్న చిన్న ఇళ్ళలాగా నిర్మించి,దాంట్లో శవాన్ని ఉంచటం ప్రాచీన ఖనన పద్దతి.మరణించిన వాళ్ళ విశ్వాసాలకనుగుణ౦గా వస్తు సామాగ్రిని సమాధిలో ఉంచి దాన్ని మట్టితో పూడ్చివేస్తారు.సమాదిచుట్టు వలయాకారంగా పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చుతారు.వీటిని చూచి ప్రజలు ఆశ్చర్యపడి వీటికి "రాక్షసగుళ్ళు" అని పేరు పెట్టినారు.బేగంపేట్,మౌలాలి,రాయగిరి,మానుకోట,డోర్నకల్లు,మధిర మొదలైన ప్రాంతాలలో కేయిరన్లు ఎన్నో కనిపించాయి.వాటిల్లో వివిధ పరిమాణాలున్న కుండలు కనిపించాయి.ఆ కుండలపయిన కొన్ని సంకేత చిహ్నాలు ఉన్నాయి.అలాంటి చిహ్నాలు మొహంజోదారోలోని ప్రాచీన నాణాలమీద కూడా కనపడుతున్నాయి.కేయిరన్లలో తూర్పున గొడ్డలి,పడమట మట్టి పాత్ర,ఉత్తరాన రాగి గిన్నె,దక్షిణాన కుండలు ఉంచేవారు. మౌలాలి కేయిరన్లలో అందమైన కట్టి దొరికింది.అందులో మృత పురుషుడు వీరుడు అయి ఉండవచ్చు.డోర్నకల్లు సమాధిలో కొడవలి దొరికింది.అతడు కృషీవలుడు అయి ఉంటాడు.


రెండువేల సంవత్సరాలకు పూర్వమే రాయలసీమ,తెలంగాణా ప్రాంతాలల్లో నాగరికత తెలిసిన ప్రజలు ఉండేవారని కేయిరన్లను బట్టి తెలుస్తుంది.అప్పటి మనుషులు అయిదున్నర,ఆరడుగుల పొడవున్దేవారు.వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరుచుకొని వ్యవసాయం మొదలయిన వృత్తులను అవలంబించినారు.వాళ్ళలో నేర్పరులయిన కమ్మరులు,కుమ్మరులు కుడా ఉండేవారు.వాళ్ళు చక్కని పనిముట్లను తయారు చేసేవారు.ఆ కాలపు శిల్పులు పెద్ద పెద్ద బండరాళ్ళను మలిచే నేర్పు కలిగి ఉండేవారు.వారి వస్తు పరిజ్ఞానం కూడా ఎన్నదగినది.వాళ్లకు పునర్జన్మఫై నమ్మకమున్నట్లు తోస్తుంది.ప్రాచీనా౦ద్రుల సంస్కృతీ ,విశేషాలు తెలుసుకోటానికి ఈ కెయిరనులు తోడ్పడతాయి.