2, ఆగస్టు 2010, సోమవారం

తెలుగు పదాలు

పదము (Word) నిశ్చితమైన అర్ధాన్నిచ్చే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అక్షరముల సముదాయము. ఇలాంటి కొన్ని పదముల సముదాయము వాక్యము.

పదాలలో రకాలు

తెలుగు భాషలో పదములు ఐదు రకములు అవి:

1. తత్సమము : సంస్కృత ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అందురు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అందురు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము

2. తద్భవము : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అందురు. వీనినే వికృతి అందురు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి

3. దేశ్యము : తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అందురు. ఉదాహరణ: పీట, చెట్టు

4. గ్రామ్యము : వ్యాకరణ విరుద్ధములైన పదములను గ్రామ్యములు అందురు. ఉదాహరణ: వస్తాడు, పోతాడు

5. అన్యదేశ్యము : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అందురు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.


భాషాభాగములు-----


తెలుగు భాషలోని పదములను ఐదు భాగములుగా విభజించవచ్చును. అవి -

నామవాచకము: మానవుల యొక్క పేర్లు, జంతువుల యొక్క పేర్లు, ప్రదేశములు, వస్తువుల పేర్లు తెలియజేయునవి. ఉదా: రాముడు, పాఠశాల, విజయవాడ, బల్ల. ఈ నామవాచకములు మరళ నాలుగు విధములు. అవి -

సంజ్ఞావాచకము: రాముడు, గోదావరి.

జాతి నామవాచకము: చెట్టు, పర్వతాలు, గోడ.

గుణ నామవాచకము: తీపి, నలుపు, తెలుపు.

క్రియా నామవాచకము: వంట, నడక, చేత.

సర్వనామము: నామవాచకమునకు బదులుగా వాడబడేది. ఉదా: నీవు, ఆమె, అతడు.

విశేషణములు: నామవాచకము, సర్వనామముల యొక్క గుణములను తెలియజేయునది. ఉదా: పొడవైన, ఎరుపు, తీపి.

అవ్యయములు: లింగ, వచన, విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఉదా: ఆహా! ఓహో! ఔరా! అకటా!

క్రియలు: పనులను తెలిపే వానిని క్రియలు అందురు. ఉదా: చదువుట, తినుట, ఆడుట.

సకర్మక క్రియలు: కర్మను ఆధారముగా చేసికొనియున్న క్రియలను సకర్మక క్రియలు అందురు. ఉదా: మధు బడికి వెళ్ళెను.

అకర్మక క్రియలు: కర్మ లేకపోయినను వాక్యము అర్థవంతమైనచో అవి అకర్మక క్రియలు. ఉదా: సోముడు పరుగెత్తెను.

సమాపక క్రియలు: పూర్తి అయిన పనిని తెలియజేయు క్రియలు సమాపక క్రియలు. ఉదా: తినెను, నడచెను.

అసమాపక క్రియలు: పూర్తికాని పనిని తెలియజేయు క్రియలు అసమపక క్రియలు. ఉదా: వ్రాసి, తిని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి