22, జనవరి 2011, శనివారం

నాకు నచ్చిన అన్నమయ్య కిరీటి

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరుగునో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల....


వివరణ
=====
ఆన్నమాచార్యులవారు భగవంతుదు చేసే ఈ జగత్ సృష్ఠి రక్షణ ప్రళయములను ఒక ఉయ్యాల ఆటతో పోల్చుచున్నారు।చంచలస్వభావము కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలలో నుండుట అలవాటైనది।జీవులు పీల్చే ఉఛ్ఛ్వాసములో నీభావము తెలుస్తు ంది। ఉఛ్చ్వాసము ఓంకారము। ఓంకారమునందు నారాయణుడు సర్వనిర్వాహకుడని, అతనికి జీవాత్ముడు దాసుడని , జీవాత్ముని లక్షణమదే అని, దాస్యమవలంబించిన జీవాత్ముడు ముక్తి కర్హుడై పరమాత్మతో యావత్కాలమును సుఖించుననే భావము గర్భితమై యున్నది।ఇది ఈ ఉయ్యాలలోనిదే।

సూర్యుడుదయించు అస్త మించు రెండు కొండలును స్తంభములయితే నక్షత్రమండల మంతయును ఈ ఉయ్యాలను మోయుచున్నది। ఈ ఉయ్యాలకు ఆకాశము అడ్డదూలము। కనుక నీ ఉయ్యాల సమస్త ప్రపంచమును నిండియున్నది।


ఉయ్యాలకు నాలుగు వేదములను బంగారు గొలుసులు।(జగత్ క్రియా కలాపములకు వేదములే ఆధారము) ఉయ్యాల పట్టి సంఖ్యాశాస్త్రము।(మూడు లోకములు , సప్తకుల పర్వతములు, త్రిగుణములు , అరిషడ్వర్గములు, చతుర్దశవిద్యలు మొదలయిన వ్యవహార మంతయు సంఖ్యాశాస్త్రము మీదనే ఆధారపడినది కనుక ఆ పట్టి సంఖ్యాశాస్త్రము)। ధర్మదేవత పీఠము।


మేఘమండలము మేలు కట్లు (బందుకట్లు)। ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగు (చాలా మేలయినది)। నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన ఆభరణము।(స్వామి యొక్క మేనిపైననే జగత్తులాధారపడియున్నవి, కనుక ఇవియే స్వామికి నగలు)।


స్తనములు కదులుచుండగా, పైటకొంగులు రాచుకొణగా స్త్రీలు ఊపే ఉయ్యాల ఇది।(భగవంతుడూపే ఈ ఉయ్యాలకు బ్రహ్మాది దేవతలు తక్కిన జీవాత్మలు కూడ సహాయ భూతులు కనుక వారు ఊపే ఉయ్యాల ఇది। అయితే వీరందరూ స్త్రీలు।"స్త్రీప్రాయమితరంజగత్ = భగవంతుడొక్కడే స్వతంత్రత కలిగిన పురుషుడు తక్కిన వారందరు భగవంతునకు పరతంత్రులు కనుక స్త్రీలే" అని శాస్త్ర నిర్ణయము। వీరు కూడ ఈ ఉయ్యాల నూపుచున్నరు కదా) ఆ స్త్రీలు బ్రహ్మాండములన్నీ ఒరిగిపోతాయనే భయంతో ఊపుచున్నారు।(జగత్ క్రియలను భగవంతుడు నిర్భయంగా చేస్తాడు , తక్కిన వారు పరతంత్రులు కనుక భయంతో చేస్తారు।)


ఈ ఉయ్యాలలో నున్న శ్రీదేవి భూదేవి ప్రతి కదలికకు నిన్ను కౌగిలించుకొందురు కదా ! స్వామీ ! దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే నీ హావభావ విలాసములు తెలుస్తాయి।


బ్రహ్మాదులకు కూడ ఇది ఆశ్చర్యకరమై వర్ణింపనలవి కాదు। కన్నుల పండువయినది। ఓ వేంకటేశ్వరా ! ఈ ఉయ్యాల ఊపుట నీకు వేడుకయిన లీల।(స్వామికు వైకుంఠము భోగము కొరకని తక్కిన లోకములు లీల కొరకని సంప్రదాయము ) ఈ పదము అన్నమయ్య గారి భావుకతకు నిదర్శనము।

http://annamacharya-lyrics.blogspot.com/search/label/lali%20patalu

click here listen song ::

17, డిసెంబర్ 2010, శుక్రవారం

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

రాక్షసగుళ్ళు(కెయిరనులు)

తెలుగు భాష మరియు ప్రాచీన ఆంద్రుల సంస్కృతీ,విశేషాలు గురించి మనకు రకరకాల ఆధారాలు ఉన్నవి .అవి శాసనాలు,నాణేలు,సాహిత్య ఆధారాలు,కైఫీయతులు,కెయిరనులు లేదా రాక్షసగుళ్ళు మొదలైనవి.అందులో కెయిరనులు లేదా రాక్షసగుళ్ళు గురించి తెలుసుకుందాం.


కెయిరనులంటే పూర్వకాలపు సమాధులు .భుగర్బాన్ని తవ్వడం వళ్ళ ఇవి బయల్పడుతాయి.కేయిరనులు రాయలసీమలోనూ,తెలంగాణా ప్రాంతాలలోను ఎక్కువగా కనిపిస్తాయి.ఒక పెద్ద గుంతతీసి,అందులో రాతి పలకలతో చిన్న చిన్న ఇళ్ళలాగా నిర్మించి,దాంట్లో శవాన్ని ఉంచటం ప్రాచీన ఖనన పద్దతి.మరణించిన వాళ్ళ విశ్వాసాలకనుగుణ౦గా వస్తు సామాగ్రిని సమాధిలో ఉంచి దాన్ని మట్టితో పూడ్చివేస్తారు.సమాదిచుట్టు వలయాకారంగా పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చుతారు.వీటిని చూచి ప్రజలు ఆశ్చర్యపడి వీటికి "రాక్షసగుళ్ళు" అని పేరు పెట్టినారు.బేగంపేట్,మౌలాలి,రాయగిరి,మానుకోట,డోర్నకల్లు,మధిర మొదలైన ప్రాంతాలలో కేయిరన్లు ఎన్నో కనిపించాయి.వాటిల్లో వివిధ పరిమాణాలున్న కుండలు కనిపించాయి.ఆ కుండలపయిన కొన్ని సంకేత చిహ్నాలు ఉన్నాయి.అలాంటి చిహ్నాలు మొహంజోదారోలోని ప్రాచీన నాణాలమీద కూడా కనపడుతున్నాయి.కేయిరన్లలో తూర్పున గొడ్డలి,పడమట మట్టి పాత్ర,ఉత్తరాన రాగి గిన్నె,దక్షిణాన కుండలు ఉంచేవారు. మౌలాలి కేయిరన్లలో అందమైన కట్టి దొరికింది.అందులో మృత పురుషుడు వీరుడు అయి ఉండవచ్చు.డోర్నకల్లు సమాధిలో కొడవలి దొరికింది.అతడు కృషీవలుడు అయి ఉంటాడు.


రెండువేల సంవత్సరాలకు పూర్వమే రాయలసీమ,తెలంగాణా ప్రాంతాలల్లో నాగరికత తెలిసిన ప్రజలు ఉండేవారని కేయిరన్లను బట్టి తెలుస్తుంది.అప్పటి మనుషులు అయిదున్నర,ఆరడుగుల పొడవున్దేవారు.వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరుచుకొని వ్యవసాయం మొదలయిన వృత్తులను అవలంబించినారు.వాళ్ళలో నేర్పరులయిన కమ్మరులు,కుమ్మరులు కుడా ఉండేవారు.వాళ్ళు చక్కని పనిముట్లను తయారు చేసేవారు.ఆ కాలపు శిల్పులు పెద్ద పెద్ద బండరాళ్ళను మలిచే నేర్పు కలిగి ఉండేవారు.వారి వస్తు పరిజ్ఞానం కూడా ఎన్నదగినది.వాళ్లకు పునర్జన్మఫై నమ్మకమున్నట్లు తోస్తుంది.ప్రాచీనా౦ద్రుల సంస్కృతీ ,విశేషాలు తెలుసుకోటానికి ఈ కెయిరనులు తోడ్పడతాయి.


30, ఆగస్టు 2010, సోమవారం

దిగంబర కవిత

సామాజిక సాహిత్య రంగాల్లో ఏర్పడ్డ స్తబ్దతను బద్దలుగోట్టే ఉద్దేశ్యంతో దిగంబర కవులు ఆవిర్భవించారు.పాత వ్యవస్తలోని అనేక విలువలను వీరు ప్రశ్నించారు .౧౯౬౫(1965)లో ప్రారంబమయి ౧౯౬౮(1968)వరకు మూడేళ్ళపాటు చెలరేగిన వీరి తిరుగుబాటు తెలుగు సాహిత్యరంగంలో సంచలనం కలిగించింది.


ఆరుగురు యువకులు ఒకచోట చేరి విచిత్రమైన కలం పేర్లతో దిగంబరకవిత్వాన్ని ఔద్దత్యంతో వెలువరించారు.అవి

౧.నగ్నముని-(కేశవరావు)
౨.నికిలేశ్వర్-(యాదగిరిరెడ్డి)
౩.చెరబండరాజు-(బద్దం భాస్కర్రెడ్డి)
౪.మహాస్వప్న-(కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు)
౫.జ్వలాముకి-(వీరరాగవాచార్యులు)
౬.భైరవయ్య-(మన్మోహన్ సహాయ్)


"ఈదేశంలో ,ఈ భూగోళంలో ఉపిరిపీల్చే ప్రతిమనిషి కోసం తపనపడి,భాదను చూసి వెక్కి వెక్కి ఏడ్చి ,పిచ్చేత్తి ప్రవచించిన కవిత్వం అని తమ కవిత్వ హేతువును గురించి చెప్పుకున్నారు.జీవచ్చవాలుగా బ్రతుకుతున్న ప్రజలను కోప్పడి,తిట్టి,భయపెట్టి,జుగుప్స కలిగించిన కవిత్వం దిగంబర కవులది.రాసింది వచన కవిత అయినా వీరు తమ కవితలను 'దిక్' అని పిలిచారు.దిగంబరశకం అనే కాలమానాన్ని కూడా ప్రకటించారు.సంవత్సరాలు,ఋతువుల పేర్లుమార్చారు.ముడుసంపుటాలు మాత్రమే వెలువరించి ముడేల్లలోనే దిగంబరశకం ముగిసింది.


నేటి సమాజంలో దుర్భర పరిస్థితులకు కారణమనుకున్న అందరిని దిగంబర కవులు తిట్టారు.స్వేచ్చా మానవుడి కోసం తపిస్తున్నామన్నారు.నేటి సమాజం కుష్టు వ్యవస్థగా మారిందని దీన్ని నాశనం చేయ్యాలనేకాకుండా 'ఏ ఆచ్చాదనకి తలోగ్గని ,ఏ భయాలకి లొంగని నిరంతర సజీవ మానవుని కోసం ఎలుగెత్తి పిలుస్తున్నాం'అన్నారు.


నగ్నముని రచించిన 'తోడవిరిగిన తరం'లో నిజం రెజర్ లాంటిది.అది సీజర్ని క్షమించదు.'అని హెచ్చరించాడు .చెరబండరాజు 'ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది'అనే కవితలో.


"పుడమి తల్లి చల్లని గుండెను
పాయలు పాయలుగా చీల్చుకొని
కాల్వాలయి ఎవరిదో
ఏ తరం కన్నీరో
గలగల సుళ్ళు తిరిగి
మెల్లమెల్లగా పారుతుంది" అని వరదనీ వర్ణించాడు.


మహాస్వప్న 'మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు'అంటూ బాపు!మోసపోలేదు కదా నువ్వు'అని గాంధీని సంబోదిస్తూ భాద పడతారు.


"అన్నా ! భయపడకు
కరువు భత్యం పెరుగుతుంది.
కొండచిలువ నోట్లోకి ఈగపిల్ల దూకుతుంది ' అంటూ ప్రభుత్వాన్ని నమ్మిమోసపోవద్దని బైరవయ్య హెచ్చరించారు. రాచమల్లు రామచంద్రారెడ్డి వీరిని అరిషడ్వర్గాలతో పోల్చారు.౧౯౭౦(1970)లో విప్లవ రచయితల సంఘంలో చేరారు.వీరి సంస్థాపన తర్వాత దిగంబర కవిత్వం అంతరించిన్నట్లు భావించవచ్చు.